Ayyappa Telugu

Loading

అయ్యప్ప మాల ధరించువారు పాటించవలసిన నియమ నిబంధనలు

ayyappa calendar

1. మొదటగా మీరు ఎప్పుడు ఎవరితో శబరియాత్ర చేయాలో నిర్ణయించాలి.

2. శబరిగిరివాసుని దర్శనార్ధమై మాల ధరించువారు ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు, పెండ్లి అయినవారు భార్య అనుమతి పొందుట మంచిది.
3. అయ్యప్పస్వామి వారి మాల ధరించేవారు ముందుగా గురుస్వామి వద్దకు వెళ్లి గురుతత్వాన్ని, నియమనిబంధనలు తెలుసుకొని గురుస్వామి ద్వారా గాని, లేదా జన్మనిచ్చిన తల్లి ద్వారాగాని, దేవాలయ అర్చకస్వాముల ద్వారా గాని మాల ధరించాలి. అయితే గురుస్వామివారితో మాలధారణ చేయుట మంచిది.
4. మొదటిసారి మాల ధరించువారు (కన్నెస్వాములు) మాత్రము పెద్దవారిలో నడిచి మకరజ్యోతిని దర్శించి శబరియాత్ర చేయుట మంచిది.
5. మాలాధారియైన అయ్యప్పలు దీక్షా సమయము నందు నుదుటపై విభూతి, గంధము, కుంకుమ అలంకరించుట,మాలలో ఉన్న చిన్ముద్ర లాకెట్కు కుడా విధిగా అలంకరించుట మంచిది. (ఏలనగా విభూతి శివప్రీతి, గంధము విష్ణుప్రీతి, కుంకుమ శక్తిప్రీతి కాబట్టి)
6. మాల ధరించిన ప్రతి అయ్యప్ప మండల దీక్షా కాలము అనగా 41 దినములు పూర్తి చేసిన పిదప తలపై ఇరుముడి ధరించి శబరియాత్ర చేయుట ఉత్తమము, మాల ధరించటానికి ముందురోజు మధుమాంస భక్షణము చేయరాదు.

7. ఎంతటివారైనను దీక్షపూని మెట్లెక్కే వేళకు 41 దినములు దీక్ష చేసి ఉండాలన్నది ముఖ్యము. అంతేకాని అర్ధమండలము (21 రోజులు), పావు మండలము (11 రోజులు), లేదా తిరిగి వచ్చిన పిదప వ్రతము పూర్తి చేయడం నిష్ఫలము, ధనవ్యయము, కాలము వృధా.
8. దీక్ష సమయమున మాల ధరించువారు శివప్రీతి అయిన రుద్రాక్షమాల గాని, విష్ణుప్రీతి అయిన తులసిమాల లేదా చందనమాల ధరించుట మంచిది, దీని వలన హరిహరుల అనుగ్రహము, హరిహరాత్మజుని అనుగ్రహము లభించును.

9.ప్రతీ అయ్యప్ప దీక్షా సమయములో నలుపు, నీలం లేదా కాషాయ వస్త్రములనే ధరించాలి. కాని శని దేవుని ప్రీతీ కొరకు నలుపు వస్త్రములు ధరించుటయే శ్రేయస్కరము.

10. మాల ధరించిన స్వాములు నేలపైన నిద్రించాలి, పరుపులు, దిండ్లు వాడరాదు, పాదరక్షకులు వాడరాదు, క్షూరకర్మములు, కేశఖండన, గోళ్ళు తీయుట చేయరాదు.
11. మాలధరించిన స్వాములు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్దితో బ్రహ్మచర్య వ్రతమును పాటించి, మధు, మాంస, ధూమపానము, మరియు బయట లభించే తినుబండారములను విసర్జించవలయును.
12. మాలదారి అయిన స్వాములు పగలు, సాయంత్రము, రెండుపూటలా చన్నీటితో స్నానమాచరించాలి. పగలు భిక్ష, రాత్రి సాత్వికమైన అల్పాహారమును స్వీకరించుట శ్రేయస్కరము.
13. ప్రతీ అయ్యప్ప ప్రాతఃకాలమున నిద్రలేచి పూజ స్థలమును శుభ్రపరచి బ్రహ్మముహూర్తకాలమున సర్వదేవతాస్తుతి మరియు అయ్యప్ప స్వామివారికి పూజను విధిగా చేయవలెను. అలాగే సుర్యాస్తమయమున కూడా అదే విధంగా జరిపించాలి.
14. చదువురాని వారు విధిగా 108 మార్లు "ఓం స్వామియే శరణం అయ్యప్ప" అంటూ శరణుఘోష చేస్తే సరిపోతుంది.
15. మాలాధారియైన స్వాములు నిరంతరము ఏకాంత వాసమున స్వామి నామమును జపిస్తూ ఉండాలి. స్వాములతో తప్ప ఇతరులతో ఎక్కువగా తిరుగుట వలన ఏకాగ్రత లోపించి దీక్ష నిబంధనలు కోల్పోవచ్చు.
16. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షలో ఉండగా అశుభకార్యక్రమములో పాల్గొనరాదు. అలాగే అవసరముంటే తప్ప దూరప్రయాణాలు చేయరాదు.
17. అయ్యప్పలు భుజించే పదార్ధములలో ఉల్లి, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులు వాడరాదు. వీలైనంత వరకు ఉప్పు, కారము వగరు తగ్గించుట మంచిది.
18. దీక్షబద్ధులైన అయ్యప్పలు గురునింద, పరనింద, ఇతరులతో, వాదోపవాదనలు చేయరాదు. ప్రతీ అయ్యప్పస్వామి సమాజంలోని వ్యక్తులతో సంభాషించునపుడు గౌరవమర్యాదలను పాటించాలి.
19. అయ్యప్పలు నడిచే దారిలో మరో అయ్యప్ప ఎదురైనప్పుడు "స్వామిశరణం" అని ఆత్మనమస్కారము చేయాలి. సమయానుకూలంగా పాద నమస్కారము కుడా చేయవచ్చు.
20. అయ్యప్పలు నిద్రించినపుడు, పాదనమస్కారములు చేయునపుడు మెడలో ఉన్న మాల తాలూక లాకెటు (చిన్ముద్ర) నేలకు తాకకుండా జాగ్రత్త వహించాలి.
21. అయ్యప్పలు దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు, దగ్గర బంధువులు, దాయాదులు ఎవరైనా పరమపదించినచో మాలను విసర్జింపవలయును.
22. అయ్యప్పలు నడిచేదారిలో శవం ఎదురైనపుడు, లేక జనసందోహములో తిరిగినపుడు రజస్వల అయినవారు, బహిష్టు అయినవారు ఎదురైనపుడు, సన్నిధికి రాగానే ఆహారపానీయాలు తీసుకోకుండా శిరస్నానము చేసి శరణుఘోష చెప్పవలయును.
23. ప్రతీ అయ్యప్పలు ఎవరైనా భిక్షకు, పూజకు మరియు భజనకు పిలిచినచో గురుస్వామి అనుమతి పొంది పాల్గొనవలయును. అంతేకాని నేను రాలేనని వాళ్ళను నొప్పించినట్లు చెప్పరాదు.
24. ధనరూపేణ, వస్తురూపేణ వచ్చిన కానుకలు శబరిమలై అయ్యప్పస్వామి వారి హుండీలో వేయడం ద్వారా, మాల ధరించిన అయ్యప్పలు ధర్మబద్ధులు కాగలరు.
25. మాలాధారి అయిన అయ్యప్పలు కుల, మత, జాతి, తన, పర, వర్ణ, వర్గ విభేదాలకు అతీతుడై ఉండాలి. తమ వృత్తి ధర్మాన్ని పాటించుకోవాలి, అంతేకాని దీక్షలో ఉన్నానని తమ పనులు మానుకోరాదు.
26. అయ్యప్పల జీవితం సేవాభాగ్యంతో సాధుజీవనం గడపాలి, అధికార హోదాలు, ధనబలము, అప్పులు చేయుట, ఆడినమాట తప్పుట, ఆడంబరాలకుపోవుట, ఇతరులను నొప్పించుట చేయరాదు.
27. మాలాధారి అయిన అయ్యప్పలు దీక్షలోను, పుజలలోను, భజనలలోను, భిక్షలోను, శరీరముపైన అంగవస్త్రం (చొక్కా) తీసి పాల్గొనుట మంచిది.
28. ప్రతీ అయ్యప్ప దీక్షాకాలమందు చేయు పూజ, భుజించు భిక్ష, సుఖించు నిద్ర సృష్టి ప్రమాణమునకు అనుగుణంగా ఉండవలయును.
29. మాల ధరించిన అయ్యప్పలకు కుటుంబసభ్యులు కూడా సహకరించుట వలన భగవంతుని సేవాభావంతో పాల్గొనే పుణ్యం కలుగుతుంది. దీక్షలోను, పూజలోను, భజన కార్యక్రమములో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలి.

౩౦. గృహములోని సభ్యులందరూ మధువు, మాంసము, విందులు, వినోదాలకు దూరంగా ఉండి, దీక్షలో ఉండే అయ్యప్పలకు సహకరించాలి.

31. తపోధనుడైన అయ్యప్పలకు శుచిగా, శుభ్రముగా, భిక్ష తయారు చేసి ఎవరైనా పెట్టవచ్చును. 

32. మాల ధరించిన అయ్యప్పలు సమాజపరమైన పరిచయస్తులకు నమస్కారములు, కరచాలనములు చేయడం శ్రేయస్కరము కాదు.

33. అయ్యప్పలు గృహములో శుచి శుభ్రత పాటించుటకు ఇతరమైన సలహాలు సూచనలు గురుస్వామి ద్వారా పొందవలయును.

34. పడిపూజ జరిపే ప్రాంగణము (స్థలము) ఆర్భాటాల నిలయం కాకుండా శోభాయమానంగా అలంకరించి, పూజలు, భజనలు నిర్ధిష్టమైన సమయమున ప్రారంభించి నిర్ణీత సమయములో ముగించుట మంచిది.

35. సర్వము త్యజించి స్వామికి ప్రతిరూపమైన అయ్యప్ప దీక్షాకాలములో శరీరముపై అలంకారములు, ఆభరణాలు, ధరించి అందరివైపు దృష్టి సారించరాదు.

36. అయ్యప్పలు దీక్షలోను, పూజలోను, భజనలోను మరియు భిక్షలోను స్వామివారినే తలుచుకుంటూ నిశ్శబ్ధము వహించి మసలుకొనుట ఉత్తమము.

37. దీక్షలో ఉండగా అయ్యప్పలు పురుషులకు 'స్వామి' యని, స్తీలకు 'మాత' యని, పిల్లలకు 'మణికంఠ' అని సంభోదించాలి.

38. అయ్యప్పలు స్వామివారి పడిపూజలో పాల్గొనేముందు జన్మప్రదాతలైన తల్లిదండ్రులకు, జ్ఞానప్రదాతలైన గురుస్వామిగారికి, నమస్కరించి వారి ఆశీస్సులు పొంది పూజ ప్రారంభించవలయును.

39. అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు పెద్దలు కావున భిక్షలో కన్నెస్వాములకు మరీ మరీ వడ్డించి బలవంతము చేసి వినోదించుట మంచిది కాదు.

40. స్వామి భక్తితో మొదటిసారి మాలధరించిన కన్నెస్వాములకు మీ చేతులందించి ఆ కరుణామయుడైన శ్రీ అయ్యప్పస్వామి దర్శనము కలిగించి భగవంతుని అనుగ్రహము పొందండి.

41. స్వామువారికి నెయ్యాభిషేకం చేసి, అభిషేక ప్రసాదముతో ఇంటికి తిరిగి వచ్చి సన్నిదానమును కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రమును చెప్పుకుని గురుస్వామి ద్వారా గాని, కన్నతల్లితో గాని (గురుస్వామి అందుబాటులో లేనప్పుడు) మాల విసర్జన చేసి దీక్ష ముగించాలి.


ఓం శ్రీ ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప.

 

అయ్యప్ప కార్యక్రమాలు

చిరునామా

ఫోన్ నంబరు

+91 7799 121 321 , +91 7842 885 885

ఈ- మెయిల్

అనుసరించండి


య్య
ప్ప

కా
ర్య
క్ర
మా
లు
అయ్యప్ప కార్యక్రమాలు