శ్రీ అయ్యప్పస్వామి వారి దర్శనం శబరిమలైలో పొందాలంటే కనీసము మండల కాలము అనగా 41 దినములు గాని ఆపైన ఎన్ని దినములు గాని మంచి గురుస్వామిని (ఇంతకు ముందు 6 సార్లు శబరిమలై యాత్ర చేసి వెళ్లి వచ్చినవారు) ఎంచుకొని నియమ నిబందనల ప్రకారము కఠినమైన దీక్ష చేసి సజ్జన సాంగత్యముతో దేవాలయాలలోను, పవిత్రమైన స్థలములలోను, స్వామివారి పూజలలోను, భగవంతుని నామాన్ని జపం చేస్తూ దీక్షను సాగించాలి. అలా దీక్ష చేసి శబరిమలై యాత్రకు వెళ్లి సత్ ఫలితాన్నిచే అయ్యప్పస్వామి వారి కృపా కటాక్షమును పొందుతారు.
మనము చేసే పూజలు, భజనలు, భక్తితో సాగాలి కాని ఆడంబరాలకు పోయి, ఆర్భాటాలకు పోయి చేయరాదు. పూజలు, భజనలు, వీలైనంత వరకు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది.
అయ్యప్ప దీక్షతో మనము మన సన్నిధానములో ముందుగా గణపతి, సుబ్రమణ్య, మంజుమాత అమ్మవారితో పాటు ఇతర దేవతలను స్తుతించి తదుపరి స్వామివారిని పూజించి కీర్తనలు పాడుకుంటూ హారతి ఇవ్వడము మన సంప్రదాయము, మాల ధరించిన అయ్యప్ప స్వాములంతా సమానమే, గొప్పబీద అనే తారతమ్యం లేకుండా అహం బ్రహ్మస్మి తత్వమసి సిద్దాంతమునకు కట్టుబడి ఉండుట చాలా మంచిది.
ఓం శ్రీ స్వామియే శరణం.
అందువల్ల అయ్యప్పదీక్ష శబరిమలై యాత్రలో ఎంతో పవితమైనది, కాబట్టి యాత్ర చేసే ప్రతి అయ్యప్పలు నియమ నిబంధనలు నిష్టతో పాటించి యాత్ర చేయవలసినదిగా కోరుతున్నాను